K24 News Telugu
Date of Publish : 11/11/2026, 10:39 pm
Published By Teegala sravan Kumar

చదువే విద్యార్థి ప్రగతికి ఆధారం విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి.

  • ఆదర్శమూర్తులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలి
  • జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
  • సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ ఎంపీహెచ్ఎస్ లో స్మార్ట్ క్లాస్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
  • జిల్లాలోని 20 పాఠశాలల్లో సీఎస్ఆర్ కింద హెచ్ డీ ఎఫ్ సీ ఆద్వర్యంలో కోటి రూపాయలతో స్మార్ట్ క్లాస్ రూమ్ ల ఏర్పాటు.

సిరిసిల్ల పట్టణం, నవంబర్ 11, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

విద్యార్థి ప్రగతికి చదువే ఆధారంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 20 పాఠశాలల్లో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ ఆద్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ( సీఎస్ఆర్ ) ఇటీవల స్మార్ట్ క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేయగా , సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ ఎం పీ హెచ్ ఎస్ లో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్ రూమ్ ను ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై ప్రారంభించారు. జిల్లాలోని 20 పాఠశాలల్లో ఆయా పాఠశాలల్లో ఒక గదికి రంగులు వేసి..నాలుగు ఫ్యాన్లు, లైట్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్, 10 డెస్క్ లు, యూపీఎస్ లు కూడా ఏర్పాటు చేయించారు. జిల్లాలోని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ ఎంపీ హెచ్ఎస్, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని తారాక రామ నగర్ ఎంపీపీఎస్, తంగళ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల, ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ , తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసన్ కాలనీ ఎంపీపీఎస్, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల, గంభీరావుపేట మండలం లింగన్నపేట జడ్పీ ఉన్నత పాఠశాల, గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట ఎంపీపీఎస్, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల, ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ ఎంపీపీఎస్, ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఎంపీపీఎస్, చందుర్తి మండలం మల్యాల జడ్పీ ఉన్నత పాఠశాల, చందుర్తి మండలం సనుగుల ఎంపీపీఎస్, వేములవాడ మండలం రుద్రవరం జడ్పీ ఉన్నత పాఠశాల, వేములవాడ పట్టణంలోని ఎంపీపీఎస్, వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి ఎంపీపీఎస్, కోనరావుపేట మండలం నిజామాబాద్ ఎంపీపీఎస్, రుద్రంగి ఎంపీపీఎస్ లో ఆయా సౌకర్యాలు కల్పించారు. 

జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ, శ్రద్ధతో సౌకర్యాలు

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక చొరవ, శ్రద్ధతో జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థలు, హాస్పిటల్ లలో సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. పలు బ్యాంకుల ఆద్వర్యంలో సీ ఎస్ ఆర్ కింద వసతులు కల్పిస్తున్నారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో సీ ఎస్ ఆర్ కింద 22 లక్షల రూపాయలతో విద్యార్థుల సౌకర్యార్థం 145 బెడ్స్, పరుపులు ఏర్పాటు చేయించారు. హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ ఆద్వర్యంలో కోటి రూపాయలతో స్మార్ట్ క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేయించారు. త్వరలో జిల్లాలోని పలు ఆసుపత్రులు, అంగన్వాడీల్లో సీ ఎస్ ఆర్ కింద వసతుల కల్పన పనులు మొదలు కానున్నాయి. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వ్యక్తి వికాసం, అభివృద్ధికి చదువు ఒక ఆయుధంగా ఉపయోగ పడుతుందని వివరించారు. ఎందరో ఆదర్శ వ్యక్తులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదిగారని గుర్తు చేశారు. బీఆర్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఏపీజే అబ్దుల్ కలాం వారి విద్యాభ్యాస కాలంలో ఎన్నో కష్టాలు పడి ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారని, దేశ నిర్మాణంలో విశేష సేవలు అందించారని కొనియాడారు. అలాగే ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి భార్య సుధా మూర్తి విద్యాభ్యాసం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆదర్శమూర్తుల ఉన్నతమైన విలువలు, దేశానికి, సమాజానికి అందించిన సేవలను ప్రతి విద్యార్థి స్ఫూర్తిదాయకంగా తీసుకొని ప్రణాళిక ప్రకారం చదవాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి తాము పుట్టిన ప్రాంతం, మాట్లాడే భాష, ఆర్థిక పరిస్థితి, కుటుంబ నేపథ్యం ఏవీ కూడా ఉన్నత విద్యాభ్యాసానికి అడ్డు రావని, ప్రతిభ చూపేందుకు అడ్డంకులు కావని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి అన్ని పాఠ్యాంశాలపై పట్టు సాధించి మంచిగా చదివి తాము అనుకున్న ఉన్నత ఉద్యోగాలు, స్వయం ఉపాధి, వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. విద్యార్థితో మార్పు సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయ్ సాగర్, తహసీల్దార్ మహేశ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజీవ్ కుమార్, హెచ్ డీ ఎఫ్ సీ బాధ్యులు శ్రావణ్ కుమార్, నాగేశ్వరరావు, కమలాకర్, మండల విద్యాధికారి దూస రఘుపతి, కాంప్లెక్స్ హెచ్ ఎం మోతిలాల్, ఏఏపీసీ ఛైర్ పర్సన్ తిప్పవరం సుధ, హెచ్ఎం చక్రవర్తుల రమాదేవి, వార్డు కౌన్సిలర్ లింగంపల్లి భాగ్యలక్ష్మి, దొంతినేని కళ్యాణి తదితరులు ఉన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save