K24 News Telugu
Date of Publish : 09/11/2026, 9:02 pm
Published By Teegala sravan Kumar

ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.

  • జిల్లావ్యాప్తంగా మొత్తం 102 దరఖాస్తుల స్వీకరణ.

రాజన్న సిరిసిల్ల జిల్లా, నవంబర్ 09, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

ప్రజావాణిలో ప్రజలు సమర్పించే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. జిల్లా స్థాయి ప్రజావాణిలో మొత్తం 66 దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

*ఆర్డీఓ కార్యాలయాల్లో 7 దరఖాస్తులు*

సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 5 దరఖాస్తులు, వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో 2 దరఖాస్తులు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి పరిష్కరించాలని ఆదేశించారు.

*మండల కార్యాలయాల్లో 29 దరఖాస్తులు*

జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.

బోయినపల్లి 2, చందుర్తి 0, ఇల్లంతకుంట 5, గంభీరావుపేట 5, కోనరావుపేట 0, ముస్తాబాద్ 6, రుద్రంగి 1, తంగళ్లపల్లి 3, వీర్నపల్లి 2, వేములవాడ అర్బన్ 0, వేములవాడ రూరల్ 2, ఎల్లారెడ్డిపేట 1 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. జిల్లా, ఆర్డీఓ, మండల స్థాయిల్లో కలిపి మొత్తం 102 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save