తెలుగు కే న్యూస్.నవంబర్ 7.
కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని దారుణ హత్యలకు పాల్పడిన ఘటనలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. వృద్ధ మహిళలను హత్య చేసి వారి వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దోచుకున్న కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆగస్టు 16న వచ్చునూరు గ్రామానికి చెందిన ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు ఉప్పులేటి భూమమ్మ (103)ను నిందితులు హత్య చేసి, ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దోచుకున్నారు. అనంతరం అక్టోబర్ 31న అదే గ్రామానికి చెందిన మరో వృద్ధురాలు ఉప్పులేటి లక్ష్మి అలియాస్ లక్ష్మవ్వ (80)ను కూడా హత్య చేసి ఆభరణాలను అపహరించారు.
ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, పోలీసుల విచారణతో నిందితుల ఆచూకీ గుర్తించారు.
వృద్ధ మహిళలు ఒంటరిగా నివసించే ఇళ్లను గుర్తించి, వారి వద్ద ఉన్న ఆభరణాలను దోచుకోవాలనే దురుద్దేశంతో నిందితులు ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ కేసుల్లో ముదిరి సాయి (24), కిన్నెర రాజు (25), ఎల్లేటి రాజు (25), పసునూరి పవన్ కుమార్ అలియాస్ జాక్ (28), మరో నిందితుడు కస్నపల్లి మణికంఠ (28)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, బంగారు, వెండి ఆభరణాలు, ఐదు మొబైల్ ఫోన్లు, ఒక ఇనుప గొట్టం తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులను ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఉన్నత అధికారులు అభినందించారు గ్రామాలలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ మహిళలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని దృష్టి సారించాలని గ్రామాలలో రాత్రివేళ ఎవరైనా అనుమానిత వ్యక్తులు వ్యవహరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు