సిరిసిల్ల పట్టణం, నవంబర్ 07, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (యూపీహెచ్‌సీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఫార్మసీ స్టోర్‌ను పరిశీలించి మందుల నిల్వలు, పంపిణీ విధానం, రికార్డులు, వివిధ రిజిస్టర్ల నిర్వహణను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, అర్హులైన బాలికలందరికీ టీకాలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఔట్‌రీచ్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ప్రతి అర్హత కలిగిన చిన్నారికి టీకాలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (ఎన్‌సీడీ)లో భాగంగా రిజిస్టర్లను పరిశీలించారు. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేలా పరీక్షలు నిర్వహించాలని, బాధితులకు అవసరమైన చికిత్సతో పాటు నిరంతర ఫాలోఅప్ చేపట్టాలని సూచించారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు క్యాన్సర్ వ్యాధులపై విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం, ధూమపానం, మద్యపానం వల్ల క్యాన్సర్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రజలకు వివరించాలన్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిత్యం వ్యాయామం, క్రమబద్ధమైన జీవనశైలిని పాటించడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు.