K24 News Telugu
Date of Publish : 08/11/2026, 4:32 am
Published By Teegala sravan Kumar

ఓటరు జాబితాలో పేరు నమోదుకు మరో అవకాశం.

  • ఈ నెల 21 వరకు ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు గడువు.
  • అర్హులైన ఏ ఒక్క ఓటరూ ఓటు హక్కు కోల్పోకూడదు.
  • రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి.

రాజన్న సిరిసిల్ల జిల్లా, నవంబర్ 07, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)-2026 ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులైన ఓటర్లకు భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 21వ తేదీ వరకు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించవచ్చని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ అమలు, ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ, ఓటరు జాబితాలో పేర్ల నమోదు, గైర్హాజరు, చిరునామా మార్పు, మరణించిన ఓటర్ల వివరాలపై శనివారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) నుంచి అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో ఏడు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లకు మరో అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ విషయంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. గైర్హాజరు, చిరునామా మార్పు, మరణం తదితర కారణాలతో ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు తిరిగి ఎన్యుమరేషన్ ఫారం సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

పోలింగ్ కేంద్రాల వారీగా జాబితాల ప్రదర్శన

గైర్హాజరు, చిరునామా మార్పు, మరణించిన (ASD) ఓటర్ల వివరాలను పోలింగ్ కేంద్రాల వారీగా జాబితాల రూపంలో ప్రదర్శించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశించారు. ఓటరు పేరు జాబితాలో చేర్చకపోవడానికి గల కారణాలను కూడా స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. ఈ జాబితాలను ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచాలని తెలిపారు.

ఓటర్లు తమ పాత ఎపిక్ నంబర్ ఆధారంగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌తో పాటు ఈసీఐనెట్ యాప్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారాలను డౌన్‌లోడ్ చేసుకుని సమర్పించవచ్చని వివరించారు. ఈ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తహసీల్దార్లు మహేష్, జయంత్, ఎన్నికల విభాగం అధికారి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save