సిరిసిల్ల , నవంబర్ 6, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు శుక్రవారం సిరిసిల్ల మినీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ అనుమతితో, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఏ. రాందాస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సాంస్కృతిక పోటీలు, పీపిటి ఛాలెంజ్ ట్రాక్ పోటీలను నిర్వహించారు. సాంస్కృతిక విభాగంలో జానపద నృత్యాలు, జానపద గేయాలు, శాస్త్రీయ సంగీతం, కవిత్వం, పెయింటింగ్, పోస్టర్ మేకింగ్, నుక్కడ్ నాటక్ తదితర పోటీలు నిర్వహించారు. అదేవిధంగా 'టెక్నాలజీ, ఇన్నోవేషన్ అండ్ ఫ్యూచర్ రెడీనెస్' అనే అంశంపై పీపిటి ఛాలెంజ్ ట్రాక్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి, కౌన్సిలర్ ఆడెపు చంద్రకళ ప్రభాకర్ పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉపాధి అధికారి నిర్మల, ఎస్సీ కార్పొరేషన్ అధికారి స్వప్న, ఇంటర్మీడియట్ బోర్డు అధికారి సురేష్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి హనుమంత్ తదితరులు హాజరయ్యారు.
వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి సుమారు 400 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలకు బాల్‌రెడ్డి, డి. ప్రభాకర్, ఎస్. బాబు, బి. అనూష, యశస్విని, గడ్డం శంకర్, కపిల నరేష్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
పోటీల విజేతలు
-జానపద నృత్యాలు : బీజేఆర్ అగ్రికల్చర్ కాలేజీ ప్రథమ స్థానం, ఈఎంఆర్ఎస్ ఎల్లారెడ్డిపేట ద్వితీయ స్థానం సాధించాయి.
-జానపద గేయాలు : ఈఎంఆర్ఎస్ ఎల్లారెడ్డిపేట ప్రథమ స్థానం, బీజేఆర్ అగ్రికల్చర్ కాలేజీ ద్వితీయ స్థానం పొందాయి.
- నుక్కడ్ నాటక్ : బీజేఆర్ అగ్రికల్చర్ కాలేజీ ప్రథమ స్థానం, ఈఎంఆర్ఎస్ ఎల్లారెడ్డిపేట ద్వితీయ స్థానం సాధించాయి.
-పెయింటింగ్ : గౌట్ నర్సింగ్ కాలేజీకి చెందిన ముస్కాన్ ప్రథమ బహుమతి, రాచర్ల జూనియర్ కాలేజీ విద్యార్థి ఎల్. రోహిత్ ద్వితీయ బహుమతి పొందారు.
-పీపిటి ఛాలెంజ్ ట్రాక్ : కేజీబీవీ వేములవాడ అర్బన్‌కు చెందిన అక్షయ మాధవి ప్రథమ బహుమతి, బీజేఆర్ అగ్రికల్చర్ కాలేజీకి చెందిన షేక్ ఫరాజ్, ఎస్. సాత్విక్ ద్వితీయ బహుమతి సాధించారు. విజేతలకు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఏ. రాందాస్ బహుమతులను అందజేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, కళా నైపుణ్యాలు, సాంకేతిక ఆలోచనలను వెలికితీసేందుకు యువజన ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.
