K24 News Telugu
Date of Publish : 06/11/2026, 9:07 am
Published By Katta Ravinder

రాంచంద్రపూర్‌లో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైందా?

  • స్మశాన వాటిక, డంపింగ్ యార్డు స్థలాలకూ కబ్జాల బెడద.. ఆరు నెలలుగా ఫిర్యాదులు చేసినా స్పందన ఏదీ?

కోహెడ మండలం: తెలుగు కే న్యూస్

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం రాంచంద్రపూర్ గ్రామంలో ప్రభుత్వానికి సంబంధించిన స్మశాన వాటిక, డంపింగ్ యార్డు స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా స్మశాన వాటికకు వెళ్లే దారిని సైతం ఆక్రమించడంతో గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యపై గత ఆరు నెలలుగా సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు పూర్తిస్థాయి పరిష్కారం చూపకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కోహెడ గ్రామానికే ప్రత్యేక నిబంధనలా?కోహెడ మండలంలోని అన్ని గ్రామాలు సమానమే కదా! కేవలం మండల కేంద్రంలోనే అక్రమాలపై చర్యలు తీసుకుంటూ, ఇతర గ్రామాల్లో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమం ఎక్కడ జరిగినా అక్రమమే. మరి అన్ని గ్రామాల్లోనూ ఒకే విధమైన నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా?అక్రమ నిర్మాణాలపైనేనా చర్యలు.. అనుమతులు ఇచ్చిన అధికారులపై ఎందుకు లేవు?ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరిగితే వాటిపై చర్యలు తీసుకోవడం ఎంత ముఖ్యమో, వాటికి అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధిత అధికారుల పాత్రపైనా విచారణ జరపడం అంతే ముఖ్యం. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చినట్లయితే బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కోహెడ మండలం అంతటా ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ చేపట్టాలి!

కోహెడ మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, అక్రమ పట్టాలు, భూ ఆక్రమణలపై సమగ్ర సర్వే నిర్వహించి వాస్తవాలను వెలికితీయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ భూముల రికార్డులు సంబంధిత రెవెన్యూ అధికారుల పరిధిలో ఉన్నప్పుడు వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా అధికారులదే.

కాబట్టి జిల్లా కలెక్టర్, ఆర్డీవో, సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రాంచంద్రపూర్ గ్రామంలోని స్మశాన వాటిక, డంపింగ్ యార్డు స్థలాలు, వాటికి వెళ్లే దారిపై క్షేత్రస్థాయి విచారణ జరిపించాలి. గత ఆరు నెలలుగా అందిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను బహిర్గతం చేయాలి. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం లేదా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే సంబంధిత అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.

ప్రజల ప్రశ్న ఒక్కటే.. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే బాధ్యత తీసుకోకపోతే, గ్రామాల ఆస్తులను కాపాడేది ఎవరు?రాంచంద్రపూర్ గ్రామ సమస్యకు తక్షణ పరిష్కారం చూపడంతో పాటు కోహెడ మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save